: రాహుల్ గాంధీ ఇండియన్ కాదు...ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటున్న సుబ్రహ్మణ్యస్వామి
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, అమేధీ ఎంపీ రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని, ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు నిన్న ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. 2003లో లండన్ చిరునామాతో బ్రిటన్ లో రాహుల్ గాంధీ ‘బ్యాకప్స్ లిమిటెడ్’ పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. ఆ కంపెనీకి కార్యదర్శిగానే కాక డైరెక్టర్ గానూ రాహుల్ గాందీ కొంతకాలం పాటు పనిచేశారని కూడా సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. 2003 ఆగస్టు 21న కార్యకలాపాలు ప్రారంభించిన సదరు కంపెనీ 2009 ఫిబ్రవరి 17న మూతపడిందని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. రాహుల్ గాంధీ తన వార్షికాదాయాన్ని రెండుసార్లు బ్రిటన్ ప్రభుత్వానికి సమర్పించారని కూడా ఆయన ఆరోపించారు. కొంతకాలానికి అమెరికాకు చెందిన ఉల్ రిక్ నైట్ అనే వ్యక్తికి కంపెనీలో 35 శాతం వాటా అమ్మేసిన రాహుల్ 65 శాతం వాటాను తన వద్దే ఉంచుకున్నారని తెలిపారు. కంపెనీని ప్రారంభించేందుకు తనకు బ్రిటన్ పౌరసత్వం ఉన్నట్లు నాడు తన దరఖాస్తులో రాహుల్ గాంధీ పేర్కొన్నారని కూడా సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. భారత్ లో ద్వంద్వ పౌరసత్వం లేనందున రాహుల్ పై కేంద్రం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.