: అనుమానిత ఇస్లాంవాదులపై 150 సార్లు దాడులు నిర్వహించాం: ఫ్రెంచ్ ప్రధాని
పారిస్ లో ఉగ్రవాదుల దాడుల అనంతరం అనుమానిత ఇస్లాం వాదులపై ఇప్పటివరకు 150 సార్లకు పైగానే దాడులు నిర్వహించామని ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుయేల్ వాల్స్ పేర్కొన్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. పారిస్, లియోన్ పోలీసుల సమాచారం ప్రకారం, ఫ్రెంచ్ సిటీలలో అనుమానిత ఇస్లామిస్టులు ఉన్నారన్న సమాచారంతో సోమవారం డజనుకు పైగా దాడులు చేసినట్లు చెప్పారు. లియోన్ సిటీలో పదమూడు సార్లు దాడులు చేశామని, కొన్ని చోట్ల ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, ఏకే-47 తుపాకీ, ఒక రాకెట్ లాంఛర్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హ్యాండ్ గన్స్ వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు. తులూస్ సిటీలో కూడా పోలీసు దాడులు జరిగినట్టు, ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసుల సమాచారం.