: కేన్సర్ రోగుల సహాయార్థం... లోకల్ ట్రైన్ లో గొంతు సవరించిన అమితాబ్!
ముంబై లోకల్ ట్రైన్ లో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ సందడి చేశారు. 'రంగ్ బర్ సే...' అంటూ పాటందుకుని రైల్లోని ప్రయాణికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అభిమానులకు ఊహించని ఆనందాన్ని కలిగించారు. ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొంటూ విరాళాలు సేకరించి, పలు స్వచ్చంద సంస్థలకు అందించే సౌరభ్ నింబ్కర్ తో కలసి అమితాబ్ పాట పాడారు. ముంబై విక్టోరియా టెర్మినస్ నుంచి భందుప్ స్టేషన్ వరకు ఇలా తాను రైల్లో ప్రయాణించినట్టు బిగ్ బి ట్విట్టర్ లో తెలిపారు. సౌరభ్ కు మద్దతు తెలిపేందుకే తానిలా ట్రైన్ లో ప్రయాణించానని పేర్కొన్నారు. రైల్లో పాటలు పాడుతూ డబ్బులు సేకరించి, వాటిని వితరణ కార్యక్రమాలకు సౌరభ్ అందజేస్తుంటాడు. అమితాబ్ నిర్వహిస్తున్న 'ఆజ్ కీ రాత్ జిందగీ' అనే టీవీ షోలో ఓసారి అతను పాల్గొన్నాడు. సౌరభ్ చేస్తున్న సమాజసేవకు బిగ్ బీ ఇంప్రెస్ అయ్యారు. అందుకే తన వంతు సాయంగా రైల్లో గొంతు సవరించారు. అయితే కేవలం మీడియాలో ప్రచారం కోసం తానిలా చేయలేదని, ఇలాంటి మంచిపని చేస్తున్న సౌరభ్ కు కాస్త ఊతం ఇవ్వడమే తన ఉద్దేశమని చెప్పారు. కాగా, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, సౌరభ్ కి కూడా ముందు చెప్పకుండానే అమితాబ్ ఇలా ట్రైన్ లో ప్రవేశించారు. పొతే, ఇప్పుడు సేకరించిన మొత్తాన్ని నిరుపేద కేన్సర్ రోగుల చికిత్సకు వినియోగిస్తారని అమితాబ్ పేర్కొన్నారు.