: నన్ను, రోజాను, భూమాను టార్గెట్ చేశారు... జగన్ గంగలోకి దూకితే, నేనూ దూకుతా: కొడాలి నాని
తెలుగుదేశం పార్టీ తనను టార్గెట్ చేసిందని వైకాపా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. తననే కాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, రోజాలను కూడా టార్గెట్ చేశారని ఆరోపించారు. భూమాపై అనవసర కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తున్నందుకే తమను టార్గెట్ చేశారని విమర్శించారు. 'మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మా అధినేత జగన్ తాట తీస్తానని వ్యాఖ్యానించిన తర్వాతే నేను చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టాను' అన్నారు నాని. 'మా అధినేతను కించపరిచేలా మాట్లాడితే, మీ అధినేతను కూడా విమర్శిస్తా'నని గతంలోనే తాను చెప్పానని... అయినా ఉమా తన తీరు మార్చుకోకపోవడంతోనే తాను చంద్రబాబును విమర్శిస్తున్నానని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ తర్వాత తనకు జగనే అత్యంత ఆప్తుడని కొడాలి నాని అన్నారు. జగన్ నాయకత్వ లక్షణాలు చాలా గొప్పవని, ఇతరులను ఆయన గౌరవించే తీరు స్ఫూర్తిదాయకమని చెప్పారు. తాను రాజకీయంగా బలహీనపడలేదని, ఇతర పార్టీల్లోకి వెళ్లే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. తన తుది శ్వాస వరకు జగన్ తోనే ఉంటానని, జగన్ తోనే నడుస్తానని, జగన్ తోనే పైకి వెళతానని వ్యాఖ్యానించారు. జగన్ గంగలోకి దూకితే తాను కూడా దూకుతానని చెప్పారు. రానున్న రోజుల్లో మా తడాఖా ఏమిటో చూపుతామని ధీమా వ్యక్తం చేశారు.