: ఏసీలో ప్రయాణించాలంటే ఇక వణుకు ఖాయం!
రూ. 100 ఖర్చుపై 50 పైసల 'స్వచ్ఛభారత్' పన్ను. వాస్తవానికి ఇదేమీ పెద్ద భారం కాదు. కానీ, రైలు ప్రయాణికుల వరకూ, అందునా అన్ని తరగతుల ఏసీల్లో ప్రయాణించే వారిపై భారీ బాదుడే. ఎందుకంటే, ఎయిర్ కండిషన్డ్ తరగతులైన ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చైర్ కార్ తదితర కంపార్టుమెంట్లలో ప్రయాణించే వారిపై అదనంగా సర్వీస్ టాక్స్ భారం పడటంతో వీరు టికెట్ ధరలపై 4.35 శాతం అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి. అయితే, నవంబర్ 15 లోపు బుక్ చేసుకున్న టికెట్లపై ఈ సర్వీస్ టాక్స్ భారం ఉండదని రైల్వే శాఖ ప్రకటన వెలువరించినప్పటికీ, నేటి నుంచి కొనుగోలు చేసే టికెట్లన్నింటిపై ఈ భారం తప్పదు. మారిన ధరల ప్రకారం, ఢిల్లీ నుంచి ముంబైకి ఏసీ-1 ప్రయాణికులపై రూ. 206 అదనపు భారం పడనుంది. ఢిల్లీ నుంచి హౌరాకు థర్డ్ ఏసీలో ప్రయాణించే వారు అదనంగా రూ. 102 చెల్లించుకోవాల్సిందే. ఇక ఢిల్లీ - చెన్నై రూట్లో సెకండ్ ఏసీ ప్రయాణానికి టికెట్ ధరపై రూ. 140 పన్ను రూపంలో పడనుంది. సర్వీస్ టాక్స్, స్వచ్ఛభారత్ పన్నుల ద్వారా రైల్వే శాఖ నుంచే సాలీనా రూ. 1000 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పెరిగిన టికెట్ ధరలను చూస్తుంటే ఏసీ రైల్లో ప్రయాణించాలంటే, వణకక తప్పదనిపిస్తోంది.