: దలైలామా నోట బీహార్ ఎన్నికల మాట... మత సామరస్యానిదే విజయమని వ్యాఖ్య
బీహార్ ఎన్నికల ఫలితాలపై అటు రాజకీయ నేతలే కాక ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ‘మహా కూటమి’ పేరిట జట్టు కట్టి ఎన్నికల్లో బీజేపీకి భారీ షాకిచ్చాయి. మూడొంతుల్లో రెండొంతుల సీట్లను గెలుచుకున్న మహా కూటమి బీజేపీకి ఘోర పరాభవాన్ని చవిచూపింది. ఈ ఎన్నికలపై టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాలు భారత్ లో మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనమని దలైలామా పేర్కొన్నారు. బీహార్ లోని హిందువులు మత సామరస్యానికే ఓటేశారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే రాజకీయాల ముఖ్య లక్ష్యమని పేర్కొన్న ఆయన సమస్యలను సృష్టించడం రాజకీయ నేతలకు తగదని కూడా వ్యాఖ్యానించారు. దలైలామా వ్యాఖ్యలను బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు స్వాగతించాయి.