: శబరిమల యాత్రికుల కోసం 294 ప్రత్యేక రైళ్లు
ఈ సంవత్సరం శబరిమల యాత్రికుల కోసం 294 ప్రత్యేక రైళ్లను, అదనపు కోచ్ లను ఏర్పాటు చేయనున్నట్టు సదరన్ రైల్వేస్ ప్రకటించింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రస్తుతం కొచ్చిన్, ఎర్నాకులం తిరుగుతున్న రైళ్లలో బెర్తుల సంఖ్యను 3,700కు పెంచనున్నామని ప్రకటించింది. సదరన్ రైల్వేస్ ఉన్నతాధికారులతో రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ శర్మ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. యాత్రికుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని రైళ్లను తిప్పుతామని అన్ని రైళ్లకూ చంగన్నూరు, తిరువళ్ల స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్నూరు తదితర స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి పంబ వరకూ చేరేందుకు బస్సులు, ప్రీ-పెయిడ్ టాక్సీ సౌకర్యాలతో పాటు వైద్య సేవల నిమిత్తం ప్రత్యేక బృందాలను, మంచినీటిని, 24 గంటల క్యాటరింగ్ సేవలను అందించనున్నట్టు వివరించారు.