: పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ కు సహకరించక, రోడ్డుపైనే బురఖా ధరించి పరుగో పరుగు!
గత రాత్రి హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రి వద్ద జరిపిన డ్రంకెన్ డ్రైవ్ లో ఓ యువతి పోలీసులను పరుగు పెట్టించింది. మద్యం సేవించి వస్తున్న ఓ యువతి, తొలుత బ్రీత్ అనలైజర్ పరీక్షకు సహకరించలేదు. ఆపై మహిళా పోలీసుల బలవంతం మీద కారు దిగి, వెనుక సీట్లో పడి ఉన్న ఓ బురఖాను తీసుకుని హడావుడిగా ధరించింది. ఆపై తన హ్యాండ్ బ్యాగును ముఖానికి అడ్డుపెట్టుకుని దూరంగా పరుగెట్టింది. చివరికి ఆమెకు పరీక్షలు జరిపి, కారును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మొత్తం 16 మందిపై కేసులు పెట్టామని, 11 కార్లు, 5 బైకులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఆ యువతి ఉదంతం మొత్తం మీడియా కళ్లకు చిక్కగా, ఆ దృశ్యాలు దాదాపు అన్ని టీవీ చానళ్లలో ప్రసారమవుతున్నాయి.