: మేం అధికారంలోకి వస్తే టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేస్తాం: కర్ణాటక బీజేపీ నేత జగదీశ్ శెట్టర్
ఇటీవల కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, ప్రభుత్వం తీరు, సీఎం సిద్ధరామయ్య వ్యవహార శైలిపై రాష్ట్ర బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. రెండున్నర సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో సీఎం విఫలమయ్యారని కర్ణాటక శాసనసభ ప్రతిపక్ష నేత జగదీశ్ శెట్టర్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత అధ్వానంగా మారాయన్నారు. రాష్ట్రంలో వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సిద్ధరామయ్య మాత్రం గోమాంసం, టిప్పు సుల్తాన్ జయంతిని తెరపైకి తెచ్చారని మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. టిప్పు జయంతి సమయంలో పలు ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగి అమాయకులు బలయ్యారని మండిపడ్డారు. అసలు టిప్పు జయంతి నిజానికి ఈ నెల 20న జరగాల్సి ఉండగా... దీపావళి సమయంలోనే నిర్వహించడంలో అర్థమేంటని జగదీశ్ శెట్టర్ ప్రశ్నించారు. దాని వెనుక ఏదో కుట్ర ఉందనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. వాటన్నిటికీ బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జయంతి సమయంలో పుట్టప్ప అనే వ్యక్తిని మారణాయుధాలతో చంపారని ఆరోపించారు. అసలు తాము అధికారంలోకి వస్తే టిప్పు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడాన్ని రద్దు చేస్తామని తెలిపారు.