: హతమైన 8 మంది ఉగ్రవాదులు... వెక్కివెక్కి ఏడుస్తున్న ప్యారిస్!
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు ఎట్టకేలకు హతమయ్యారు. నిన్న రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు తెగబడ్డ 8 మంది ఐఎస్ ముష్కరులను ప్యారిస్ పోలీసులు మట్టుబెట్టారు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు తొలుత ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. ఆ తర్వాత మరింత మంది ఉగ్రవాదులు ఉంటారన్న అనుమానంతో నగరాన్ని జల్లెడ పట్టిన పోలీసులు మరో ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల పెను దాడి నేపథ్యంలో సుందర నగరంగా పేరున్న ప్యారిస్ రక్తసిక్తమైంది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, నగరంలో విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించారు. అయితే నగరంలో రైలు, విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల మెరుపు దాడితో నగరంలో భీతావహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల తూటాలకు ఆప్తులను కోల్పోయిన నగర జనం వెక్కి వెక్కి ఏడుస్తున్న వైనం ప్రపంచ దేశాలను కలచివేస్తోంది.