: రేపటి నుంచి బాలల చలనచిత్రోత్సవం...ముస్తాబైన భాగ్యనగరం
రేపటి నుంచి 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం హైదరాబాదులో ప్రారంభం కానుంది. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించనున్న చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ప్రసాద్ ఐమ్యాక్స్ తో పాటు 12 సినిమా ధియేటర్లను ఎంపిక చేశారు. రెండేళ్లకోసారి నిర్వహించే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం వేడుకలు శిల్పకళా వేదికలో రేపు ప్రారంభం కానున్నాయి. ముగింపు వేడుకలను కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. బాలల మేధస్సుకు పదును పెట్టే సినిమాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తారు. ఈ సినిమాలకు పిల్లలకు రాయితీ ధరకు టికెట్లు అందజేస్తారు. ఇందులో ప్రదర్శన కోసం 1204 సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో 283 సినిమాలు భారతీయ సినిమాలు కాగా, 921 విదేశీ చలన చిత్రాలు ఉన్నాయి. ఇందులో 19 తెలుగు సినిమాలు పోటీ పడ్డాయి. ఈ ఏడాది ప్రదర్శనకు 300 బాలల సినిమాలను ఎంపిక చేయగా, అందులో ఒకే ఒక్క తెలుగు సినిమా 'ఆదిత్య' ఉండడం విశేషం. బాలల చలన చిత్రోత్సవంలో వివిధ దేశాలకు చెందిన బాల మేధావులు పాలుపంచుకుంటున్నారు. డిజిటల్ థీమ్ పేరిట బాలలకు వినూత్న అనుభూతి కల్పించేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. 37 మంది బాల దర్శకులు బంగారు ఏనుగును దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.