: ఉగ్రవాదులు, మావోలపై ఉక్కుపాదం మోపుతాం: టీఎస్ డీజీపీ అనురాగ్ శర్మ
ఉగ్రవాదులు, మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. పూర్తి స్థాయి డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ, ప్రజలను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పోలీసుల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అనుసరిస్తామని ఆయన తెలిపారు. కరీంనగర్ లో వడ్డీల పేరిట వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఏఎస్సై మోహన్ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని, నిష్పాక్షిక విచారణ కోసమే కేసును సీఐడీకి బదలాయించామని ఆయన చెప్పారు. విచారణలో నిజానిజాలు నిర్ధారించుకుని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.