: రేపటి రెండో టెస్టుకు సర్వం సిద్ధం
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల రెండో టెస్టుకు సర్వం సిద్ధమైంది. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్ ఉత్సాహంగా ఉంది. కాగా, తొలి టెస్టులో స్పిన్ మంత్రంతో విజయం సాధించిన భారత జట్టును ఎలాగైనా ఓడించాలని సఫారీలు పట్టుదలగా ఉన్నారు. చిన్నస్వామి స్టేడియంలో పిచ్ ను మరోసారి భారత్ కు అనుకూలంగా తయారు చేశారు. మొహాలీ పిచ్ పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మంచి వికెట్ తయారు చేయాలని, అదే సమయంలో భారత్ కు లాభించేదిగా ఉండాలని క్యూరేటర్ కు టీమిండియా అధికారులు సూచనలు ఇచ్చారు. కాగా, తొలి రెండు రోజులు బ్యాటింగ్ కు, మిగిలిన మూడు రోజులు స్పిన్ కు అనుకూలమైన వికెట్ ను తయారుచేసినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, రెండు జట్లు విజయం కోసం వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. మూడు రోజుల ముందు బెంగళూరు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు దీపావళి సంబరాలు జరుపుకోవడంతో పాటు, ప్రాక్టీస్ లో మునిగిపోయారు. మళ్లీ స్పిన్ ఉచ్చు బిగుస్తుందని భావించిన సఫారీలు రంజీ ఆటగాళ్లతో స్పిన్ బంతులేయించుకుని ప్రాక్టీస్ చేశారు. కాగా, తొలి టెస్టు గెలిచిన ఉత్సాహంతో టీమిండియా ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో కలసి దీపావళి జరుపుకున్నారు. రేపు ఉదయం మ్యాచ్ ప్రారంభం కానుంది.