: అద్వానీపై వెంకయ్యనాయుడు చురకలు!
భాజాపా సీనియర్ నేతలు ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు రాసిన లేఖపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. సీనియర్ నేతలకు చురకలు అంటించారు. ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా, పార్టీ వేదికలపై మాట్లాడితే, వారిపై మరింత గౌరవం పెరిగేదని అన్నారు. బీహార్ ఎన్నికలు ముగిసిన ఘట్టమని, అక్కడ ఓటమి బాధించినప్పటికీ, భవిష్యత్ పై సమాలోచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. జరిగిన దాన్ని మరచి జరగాల్సింది చూడాలని, అద్వానీ తమ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న నేతని, ఆయన అభిప్రాయాలు తమకు శిరోధార్యమని అన్నారు. ఇక బీహార్ ఓటమి కేంద్ర పాలనపై ఎంతమాత్రమూ ప్రభావం చూపబోదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజకీయం వేరని, దేశ రాజకీయం వేరని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.