: ఫలక్ నూమా కాలేజీలో స్ట్రీట్ ఫైట్!... పెళ్లి కుదిరిన అమ్మాయికి వేధింపులే కారణమట


హైదరాబాదు పాతబస్తీలో నేటి ఉదయం మరో స్ట్రీట్ ఫైట్ జరిగింది. ఇప్పటికే పాతబస్తీలో చోటుచేసుకున్న రెండు స్ట్రీట్ ఫైట్లలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. తాజా ఘటనలో మరణాలేమీ లేనప్పటికీ ఈ రణరంగానికి ఓ కళాశాల వేదికగా నిలవడం కలకలం రేపుతోంది. ఫలక్ నూమా పరిధిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. వివరాల్లోకెళితే... వివాహం ఖరారై ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా పూర్తైన ఓ విద్యార్థినిపై ఆమె చదువుతున్న కళాశాలకు చెందిన విద్యార్థి ప్రేమ పేరిట వేధింపులకు దిగాడు. పేపర్ పై తన మొబైల్ నెంబర్ రాసి సదరు యువతికి ఇచ్చిన యువకుడు, నిత్యం తనకు ఫోన్ చేయాలని వేధించాడు. వేధింపులు మరింత ఎక్కువ కావడంతో బాధిత విద్యార్థిని విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. దీంతో ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి కళాశాలకు వచ్చి వేధింపులకు దిగిన విద్యార్థిపై దాడి చేశాడు. వెంటనే తేరుకున్న ఆ విద్యార్థి కూడా తన స్నేహితులను పోగేసుకుని ఎదురు దాడి చేశాడు. దీంతో కళాశాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. అంతేకాక విద్యార్థినిపై వేధింపులకు దిగిన యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News