: హెల్మెట్ లేకుంటే జరిమానా మాత్రమే... లైసెన్స్ రద్దు, వాహనం జప్తు లేనట్టే!
ఆంధ్రప్రదేశ్ లో తప్పనిసరి హెల్మెట్ అమలుపై చంద్రబాబు సర్కారు మరోసారి మెట్టుదిగింది. ప్రస్తుతానికి ఎవరినీ నొప్పించని రీతిలో ముందుకు సాగాలని, హెల్మెట్ లేనివారికి కేవలం జరిమానా మాత్రమే విధించి వదిలి వేయాలని పోలీసులకు రవాణా శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. మొదటిసారి దొరికితే రూ. 100, రెండోసారి రూ. 1000, ఆపై లైసెన్స్ రద్దు, వాహనం సీజ్ వంటి శిక్షలు ఉంటాయని తొలుత చెప్పినప్పటికీ, అంత కఠినంగా ఉంటే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను ప్రభుత్వం తట్టుకోలేదని, పైగా పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తి రాష్ట్రంలో కొత్త సంక్షోభం ఏర్పడుతుందని కొందరు మంత్రులు, అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో లైసెన్సులు, వాహనాల జోలికి వెళ్లవద్దని, జరిమానాలతో సరిపెట్టాలని వారికి సూచించినట్టు తెలుస్తోంది. కాగా, గురువారం ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా 1,472 మందికి జరిమానాలు విధించి రూ. 1,48,700 వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు హెల్మెట్ నిబంధనల అమలుపై మంత్రి శిద్ధా రాఘవరావు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ప్రజా స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు.