: టీ టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ పై హత్యాయత్నం కేసు!


టీ టీడీపీలో కీలక నేత, ఆ పార్టీ యువ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వివేకానంద్ కు తన సొంత బాబాయి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు (డీసీసీ చీఫ్) కేఎం ప్రతాప్ గౌడ్ తో విభేదాలున్నాయి. హైదరాబాదు శివారు ప్రాంతం చింతల్ లో వీరిద్దరికి చెందిన ఓ స్థలం ఉంది. దీపావళి సందర్భంగా సదరు స్థలంలో వివేకానంద్ ఆదేశాలతో హరికృష్ణ అనే వ్యక్తి టపాసుల దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న కేఎం ప్రతాప్ కుమారుడు కేపీ విశాల్, వివాదాస్పద స్థలంలో దుకాణం ఎలా ఏర్పాటు చేశావని హరికృష్ణను నిలదీశారు. దీనిపై సమాచారం అందుకున్న వివేకానంద్ అక్కడికి చేరుకున్నారు. వివేకానంద్, విశాల్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో విశాల్ పై వివేకానంద్ చేయి చేసుకున్నారు. దీంతో వివేకానంద్ తనపై దాడి చేశారని, తనను హత్య చేసేందుకు యత్నించారని విశాల్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివేకానంద్ పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డబ్బులివ్వాలని తనను బెదిరించారని టపాసుల దుకాణ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాల్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News