: రూ. 4.4 లక్షల కోట్ల నష్టం... మార్కెట్ ఇన్వెస్టర్లకు చుక్కలు!


అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ ఇబ్బందులైతేనేమి, ఇండియాలో నెలకొన్న పరిస్థితులైతేనేమి, ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు రూ. 4.45 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బెంచ్ మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 2,090.54 పాయింట్లు లేదా 7.47 శాతం దిగజారి, 25,866.95 పాయింట్లకు చేరింది. సెప్టెంబరు 8న 52 వారాల కనిష్ఠ స్థాయి 24,833 పాయింట్లను కూడా తాకింది. లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ కాప్ మార్చి 31న 101.49 లక్షల కోట్లుగా ఉండగా, ఇప్పుడది 97,03,605 లక్షల కోట్లకు తగ్గింది. మొత్తం రూ. 4,45,395 కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయినట్టు బీఎస్ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు మూడు నెలలుగా మార్కెట్ సూచికలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోగా, గ్రీస్ లో ఆర్థిక మాంద్యం, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, చైనా కరెన్సీ పతనం, క్రూడాయిల్ మార్కెట్ వంటి అంశాలెన్నో వ్యతిరేక ప్రభావాన్ని చూపాయి. ఇక డిసెంబర్ లో జరిగే సమీక్షలో వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం వెలువడవచ్చని ఫెడ్ చైర్ పర్సన్ జానెట్ ఎలెన్ వ్యాఖ్యానించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. చైనా మాంద్యం వెలుగులోకి వచ్చిన ఆగస్టు 24న ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పతనం నమోదు కాగా, సెన్సెక్స్ 1,624 పాయింట్లు దిగజారింది. ఆ ఒక్క రోజే రూ. 7 లక్షల కోట్ల సంపద హారతి కర్పూరమైంది. సమీప భవిష్యత్తులో యూఎస్ ఫెడ్ నిర్ణయం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని, ఇదే సమయంలో ద్రవ్యోల్బణం, ఐఐపీ, ఆర్థిక లోటు వంటి దేశవాళీ అంశాలు కీలకమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. డిసెంబర్ సమీక్షలో యూఎస్ లో వడ్డీ రేట్ల పెంపు ఖాయమైతే, ఇన్వెస్టర్లకు మరోసారి చుక్కలు కనిపించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News