: తాజా గణాంకాలు... ఇండియాలో ఆఫీసులకు నడిచివెళ్లేది కొద్దిమందే!
ఇటీవలి కాలంలో ఇండియాలోని ఉద్యోగులు, కార్మికుల్లో నూటికి 23 శాతం మంది మాత్రమే తమ కార్యాలయాలు, పని చేయాల్సిన స్థలాలకు నడిచి వెళుతున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా, తాజాగా విడుదలైన గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. 15 శాతం మంది ప్రభుత్వం అందించే రవాణా సదుపాయాలను వినియోగించుకుంటుండగా, 33 శాతం మంది రైళ్లు, ప్రైవేటు ట్రాన్స్ పోర్టును వాడుకుంటున్నారని, మరో 30 శాతం మంది తమ ఇంటి నుంచే పని చేసుకుంటున్నారని తెలుస్తోంది. సగటున ఇంటి నుంచి కార్యాలయానికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుండగా, వ్యవసాయ కూలీలు, గృహాల్లో పనిచేసే వారిని పరిగణనలోకి తీసుకోకుండా ఈ గణాంకాలు తయారు చేశామని, ఇందులో భాగంగా 20 కోట్ల మందిని సర్వే చేశామని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ అండ్ డెవలప్ మెంట్ పాలసీ రీజనల్ డైరెక్టర్ జి.శ్రేయ వివరించారు. ఇంటి నుంచి పనిచేసేవారిలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లోని వారని, పట్టణ ప్రాంతాల్లోని పేదల్లోనే అత్యధికులు నడిచి వెళుతున్నారని తెలిపారు. చెన్నై నగరంలో 16 శాతం మంది నడిచి, 23 శాతం మంది బైక్ లపై, 19 శాతం మంది బస్సుల్లో వెళుతుండగా, ఇతర రవాణా మార్గాల ద్వారా 21 శాతం మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. ముంబైలో 25 శాతం మంది నడిచి, 4 శాతం మంది బైక్ లపై, 16 శాతం మంది బస్సుల్లో వెళుతుండగా, ఇతర రవాణా మార్గాల ద్వారా 34 శాతం మంది ప్రయాణిస్తున్నారని, అదే ఢిల్లీలో వివిధ ప్రయాణమార్గాలను ఎంచుకుంటున్న వారి సంఖ్య వరుసగా 22 శాతం, 14 శాతం, 22 శాతం, 26 శాతంగా ఉందని తెలిపారు.