: నితీశ్ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా, కేజ్రీ, దీదీ... రాహుల్ గాంధీ కూడా!
ఉత్కంఠభరితంగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పోటీగా జట్టు కట్టిన సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలు ఘన విజయం సాధించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా మూడొంతుల్లో రెండు వంతుల సీట్లను మహా కూటమి కైవసం చేసుకుంది. ఇక ఇప్పటికే రెండు టర్మ్ లుగా సీఎంగా కొనసాగుతున్న నితీశ్ కుమార్ తాజాగా మూడో దఫా సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ నెల 20న పాట్నాలో జరగనున్న కార్యక్రమంలో నితీశ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారట. ఇక నితీశ్ కు అభినందనలు తెలిపిన ఢిల్లీ, పశ్చిమబెంగాల్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ కూడా హాజరుకానున్నారు. ఉత్తర ప్రదేశ్, ఒడిశా, అసోం సీఎంలు అఖిలేశ్ యాదవ్, నవీన్ పట్నాయక్, తరుణ్ గొగోయ్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది.