: ఫేస్ బుక్ లో పసివాడి విక్రయం


భావాలు పంచుకుంటూ, సమాచారం ఇచ్చిపుచ్చుకునే వేదికగా రోజురోజుకీ ప్రపంచం నలుమూలలకూ చొచ్చుకుపోతున్న ఫేస్ బుక్ ను ఇలాంటి పనులకు కూడా వాడవచ్చని నిరూపించాడో ఘనుడు. రోజుల మగ బిడ్డను ఫేస్ బుక్ లో సులువుగా విక్రయించేసి సామాజిక మాథ్యమాల వెబ్ సైట్లపై కొత్త ప్రశ్నలు రేకెత్తించాడు. పంజాబ్ లోని లుథియానా పట్టణంలో తాజాగా ఓ సంచలన ఘటన జరిగింది.

ఇక్కడి సత్యం హాస్పిటల్ లో ఒక మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాతే ఆ పసివాడిని అదే ఆసుపత్రిలోని నర్సుకు 40వేలకు అమ్మేశాడు. ఆ నర్సు తెలివిగా అదే హాస్పిటల్ లోని ల్యాబ్ అసిస్టెంట్ గురుప్రీత్ కు 3 లక్షల రూపాయలకు ఆ పిల్లాడిని విక్రయించి సొమ్ము చేసుకుంది. ఇక ల్యాబ్ అసిస్టెంట్ గురుప్రీత్ ఆ పసివాడిని ఏకంగా ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టాడు. ఇది చూసిన అతడి స్నేహితుడు, ఢిల్లీకి చెందిన వ్యాపారి ఒకరు 8 లక్షలు చెల్లించి బాబును సొంతం చేసుకున్నాడు.

రోజుల బిడ్డ దూరం కావడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పసివాడిని వరుసబెట్టి అమ్ముకున్న దారుణం వెలుగు చూసింది. మొత్తానికి పోలీసులు చిన్నారిని తల్లి చెంతకు చేర్చారు. తాత, నర్స్, ల్యాబ్ అసిస్టెంట్ ను అరెస్ట్ చేశారు. వ్యాపారి మాత్రం పరారీలో ఉన్నాడు. నాణేనికి రెండు కోణాలు ఉన్నట్లు, ఫేస్ బుక్ లాంటి సైట్లను ఇలా వినియోగించే ప్రబుద్ధులు ఉంటే ఇలాంటివే మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది.

  • Loading...

More Telugu News