: ఇక దూసుకుపోతాం: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే
రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే వెల్లడించారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలవనప్పటికీ, తమ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్య శివసేనలో ఉత్సాహాన్ని నింపింది. మహారాష్ట్ర వెలుపల ఎన్నికల్లో పోటీచేయాలని గతంలో ఎన్నడూ తాము భావించలేదని... అయితే, ప్రస్తుతం తాము తమ కార్యాచరణను మార్చుకున్నామని చెప్పారు. హిందుత్వ అజెండాతోనే తాము ముందుకు వెళతామని స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికల్లో తాను వ్యక్తిగతంగా ప్రచారం చేయనప్పటికీ రెండు లక్షలకు పైగా ఓట్లను తాము సాధించామని ఉద్ధవ్ తెలిపారు. అయితే, బీహార్ లో బీజేపీ ఓటమిపై స్పందించడానికి నిరాకరించిన ఉద్ధవ్... ఓటమికి సంబంధించి పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే స్పందించారని, తాను మాట్లాడటానికి ఏమీ లేదని చెప్పారు.