: పవన్ కల్యాణ్ వెంట టీడీపీ ‘గ్రేటర్’ చీఫ్... చంద్రబాబుతో భేటీలో గ్రేటర్ ఎన్నికలపై చర్చ?
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల మధ్య మరికాసేపట్లో జరగనున్న భేటీలో ఏపీ అంశాలే కాక తెలంగాణ అంశాలపైనా కీలక చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భేటీలో ఏఏ అంశాలను ప్రస్తావించాలన్న అంశంపై ఇప్పటికే ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హైదరాబాదులో పవన్ కల్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కామినేని వెంటరాగా పవన్ కల్యాణ్ తన ఇంటి నుంచి నేరుగా శంషాబాదు ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడ బయలుదేరారు. పవన్ కల్యాణ్ వెంట కామినేనితో పాటు టీ టీడీపీ నేత, పార్టీ ‘గ్రేటర్’ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా విజయవాడ వెళ్లారు. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్ ఇటీవలే ప్రకటించింది. అంతేకాక గ్రేటర్ ఎన్నికల్లో తాము పోటీ చేయనున్నట్లు గతంలో స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వెంట మాగంటి గోపీనాథ్ విజయవాడ వెళ్లడంపై పలు ఆసక్తికర కథనాలు కథనాలు వెలువడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబుతో పవన్ కల్యాణ్ చర్చించనున్నట్లు కూడా సమాచారం. గడచిన ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగిన టీడీపీ, బీజేపీకి పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచారు. కూటమికి ఘన విజయం దక్కేలా చేశారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో కూడా బీజేపీ, టీడీపీలు కూటమిగానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అయితే కొత్తగా తెరంగేట్రం చేయనున్న జనసేనను కూడా కలుపుకుని బరిలోకి దిగితే గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకునే అవకాశాలు లేకపోలేదని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీలో గ్రేటర్ ఎన్నికల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. అందుకోసమే మాగంటి గోపీనాథ్ పవన్ కల్యాణ్ వెంట వెళ్లినట్లు కూడా తెలుస్తోంది.