: 17 ఏళ్లుగా జైల్లో ఉన్న ఉల్ఫా నేతను భారత్ కు అప్పగించిన బంగ్లాదేశ్
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా) నేత, 17 సంవత్సరాలుగా ఢాకా జైల్లో మగ్గుతున్న అనూప్ చేతియాను బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ కు అప్పగించింది. అనూప్ అసలు పేరు గోపాల్ బారువా కాగా, ప్రస్తుతం 48 సంవత్సరాల వయసున్న ఆయన నిషేధిత ఉల్ఫా వ్యవస్థాపక కార్యదర్శి. ఆయనతో పాటు మరో ఇద్దరిని భారత సరిహద్దుల వద్ద భద్రతా దళాలకు నిన్న బంగ్లాదేశ్ అప్పగించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో బంగ్లాదేశ్ సహకారం అందిస్తోందని తెలిపారు. గత 15 ఏళ్లుగా చేతియాను అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. నకిలీ పాస్ పోర్టు, విదేశీ నగదు కలిగివున్న ఆరోపణలతో పాటు అక్రమంగా సరిహద్దులు దాటాడన్న ఆరోపణలపై 1997లో చేతియాను బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయినా, ఆయన్ను మాత్రం విడుదల చేయలేదు. జైల్లో ఉన్న సమయంలోనూ ఆయన ఉల్ఫా నేతలతో అప్పుడప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాడని తెలుస్తోంది.