: విజయవాడలో బిజీబిజీగా పవన్ కల్యాణ్... షెడ్యూల్ ఎలాగంటే...!
జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కీలక భేటీ నిర్వహించనున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం అందినా, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం షూటింగ్ బిజీ కారణంగా ఆయన హాజరుకాలేకపోయారు. షూటింగ్ నుంచి వచ్చీరాగానే ఆయన కార్యరంగంలోకి దూకేశారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం ఆయన నిన్న చేసిన యత్నానికి ఏపీ సీఎంఓ అధికారులు కూడా వేగంగా స్పందించారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుతో భేటీకి పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ లభించింది. దీంతో నేటి ఉదయం పవన్ కల్యాణ్ విజయవాడకు వెళ్లనున్నారు. విజయవాడ శివారులోని గన్నవరం విమానాశ్రయానికి ఉదయం 10.30 గంటలకు పవన్ చేరుకుంటారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు జనసేన పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ తర్వాత 11 గంటలకు పవన్ కల్యాణ్ రాజధాని రైతులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. తదనంతరం ఆయన 12 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు.