: కన్నా, గల్లాపై మండిపడ్డ రాయపాటి
ఎంపీ గల్లా జయదేవ్, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం నుంచి 60 వేల కోట్లు ఎలా వచ్చాయో కన్నా వివరించాలని డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికల్లో ఓటమితోనైనా బీజేపీ ఆలోచనా విధానంలో మార్పువస్తుందని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తాను తీసుకువచ్చిన తెనాలి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని తాను తెచ్చానంటూ గల్లా చెప్పుకోవడం హాస్యాస్పదమని రాయపాటి విమర్శించారు. గ్రామ కంఠాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదారంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. నామినేటెడ్ పదవుల భర్తీపై తిరుపతి సమావేశాల్లో స్పష్టత వస్తుందని, ఈ నెలాఖరుకి భర్తీ అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.