: విశాఖలో కలకలం రేపుతున్న మావోల లేఖ... బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ లేఖాస్త్రం
విశాఖ జిల్లాలో నిషేధిత మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన జీవో నెం:97ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి మావోయిస్టుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. మంత్రి పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేయాలని మావోయిస్టులు అయ్యన్నకు లేఖ రాశారన్న వార్తల నేపథ్యంలో ఆయనకు భద్రత పెరిగింది. తాజాగా మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ ప్రతినిధి మంగన్న పేరిట మరో లేఖ విడుదలైంది. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులకు లాభమేమీ లేకపోగా, వారి జీవితాలు ప్రమాదంలో పడతాయని ఆ లేఖలో మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని, ఇందుకు గిరిజనులు మద్దతు పలకాలని ఆ లేఖలో మంగన్న కోరారు. ప్రస్తుతం ఈ లేఖ విశాఖ జిల్లాలో కలకలం రేపుతోంది.