: అకల్ తఖ్త్ చీఫ్ గా ‘బియాంత్’ హంతకుడి నియామకం...'సిక్కు'ల్లో భిన్నాభిప్రాయాలు!
‘ఆపరేషన్ బ్లూ స్టార్’కు కారకుడైన జర్నైల్ సింగ్ బింద్రన్ వాలేను గుర్తు చేస్తూ సిక్కుల సంఘాలు నిన్న ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అమృత్ సర్ లో ‘సర్బత్ ఖల్సా’ పేరిట సమావేశమైన సిక్కుల సంఘాలన్నీ కలిసి తమ అత్యున్నత సంస్థ అయిన ‘అకల్ తఖ్త్’ చీఫ్ గా జగ్తార్ సింగ్ హవారాను ఎన్నుకున్నాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హవారా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. హవారా విడుదలయ్యే దాకా మాజీ ఎంపీ ధియాన్ సింగ్ మంద్... అకల్ తఖ్త్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని సిక్కుల సంఘాలు పేర్కొన్నాయి. అమృత్ సర్ లోని సిక్కుల ఆలయం స్వర్ణ దేవాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అకల్ తఖ్త్ సిక్కులకు సంబంధించిన అత్యున్నత మత సంస్థ. ఇంతటి ప్రాధాన్యం కలిగిన అకల్ తఖ్త్ కు సీఎం స్థాయి వ్యక్తిని హతమార్చిన వ్యక్తిని ఎలా నియమిస్తారని సిక్కుల మరో ప్రధాన సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబందక్ కమిటీ (ఎస్జీపీసీ)తో పాటు పంజాబ్ లోని అధికార పార్టీ శిరోమణి అకాలీదళ్ కూడా నిరసన వ్యక్తం చేసింది. సర్బత్ ఖల్సా తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించేది లేదని కూడా తేల్చిచెప్పాయి. ప్రస్తుతం దీనిపై సిక్కుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ‘దందానీ తక్సల్’ చీఫ్ హోదాలో స్వర్ణ దేవాలయంలో తిష్ట వేసిన జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేశాడు. స్వర్ణ దేవాలయాన్నే తన స్థావరంగా మార్చుకుని పెద్ద పన్నాగమే పన్నాడు. అయితే ముందుగానే ప్రమాదాన్ని గుర్తించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేరిట స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని పంపి బింద్రన్ వాలేను మట్టుబెట్టించారు. నాటి ఘటన ఇందిరా గాంధీ కేరీర్ లో ఓ మచ్చగా మిగిలిపోయింది. చివరికి అదే ఆమె హత్యకు కూడా కారణమైంది. తాజాగా సిక్కుల సంఘాలకు అత్యున్నత సంస్థగా కొనసాగుతున్న అకల్ తఖ్త్ కు మరో నేరస్తుడిని నియమిస్తున్నట్లు ప్రకటన రావడంతో నాటి తరహా ఘటనలు పునరావృతమవుతాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.