: కోట్ల మంది మహిళల అసహనానికి ఆమె సమాధానం చెప్పింది


వివాహం చేసుకుని పిల్లల్ని కని, వారి బాధ్యత గాలికి వదిలేసి ఇంకో మహిళతో సంబంధం పెట్టుకునే పురుషపుంగవులకు ప్రపంచంలో కొదువలేదు. ఇంత జరిగినా కుటుంబ పోషణ, పరువు ప్రతిష్ఠలు, బరువు బాధ్యతలు మహిళలే మోస్తారు. ఏమన్నా అంటే దిక్కున్న చోట చెప్పుకోమంటారు. అలాంటి పురుషులపై పగతీర్చుకోవాలని ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయతలో చాలా మంది మునిగిపోతారు. పెరూకి చెందిన సుజాన్నే వాస్క్వెజ్ మాత్రం అలా ఊరుకోలేదు. తన భర్త ప్రవర్తనలో వచ్చిన తేడాను గుర్తించిన సుజాన్నే ఓ స్వచ్చంద సంస్థను ఆశ్రయించింది. జరుగుతున్న విషయాలన్నీ ఏకరువుపెట్టి తన భర్తపై నిఘా పెట్టాలని కోరింది. ఆమె అనుమానం నిజమని గుర్తించిన సదరు స్వచ్ఛంద సంస్థ విషయం ఆమెకు వివరించింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త ఆరోజు అర్జెంటుగా స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. దీంతో అనుమానం మరింత పెరగడంతో సుజాన్నే అతనిని అనుసరించింది. అతను స్థానిక బార్ లోపలికి వెళ్లడం గమనించింది. స్నేహితులతో ఉన్నాడేమో అనే శంక పీకుతున్నా అనుమానంతో బార్ లోపలికి ప్రవేశించింది. ప్రియురాలితో విందు, వినోదాల్లో తేలియాడుతున్న భర్తను చూసి కోపం కట్టలు తెంచుకుంది. బార్ లో ఉన్నవారి సహకారంతో అతనిని బయటకు తీసుకువచ్చి చితకబాదింది. కోపం చల్లారక దగ్గర్లో కొరడా దొరికితే దానితో కూడా బాదేసింది. అనంతరం 'నీ తల్లిని మోసం చేశావు, కట్టుకున్న భార్యను మోసం చేశావు, నీ పిల్లలు తిండి లేక అల్లాడుతుంటే నీకు ప్రియురాలితో జల్సాలా?' అంటూ అతన్ని నిలదీసి గుండెలవిసేలా రోదించింది. ఈ దృశ్యాలన్నీ బార్ దగ్గర సీసీటీవీ పుటేజ్ లో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఆమెను అభినందించగా, సదరు పురుష పుంగవుడ్ని తిట్టిపోస్తున్నారు.

  • Loading...

More Telugu News