: శభాష్ కేజ్రీవాల్! ...ప్రాజక్టులో 105 కోట్ల మిగులు చూపిన ఢిల్లీ ముఖ్యమంత్రి!
సాధారణంగా ఓ నిర్మాణంపై ప్రభుత్వం ఓ అంచనా వేసి, ప్రణాళిక రచించి కాంట్రాక్టు అప్పగించిందంటే దాని వ్యయం పెరుగుతుందే తప్ప తరగదు అనేది అందరికీ తెలిసిన సత్యం. దీనిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పని నిరూపించారు. అద్భుతమైన పనితీరుతో అంచనాలను కూడా తల్లకిందులు చేయవచ్చని కేజ్రీవాల్ చేతల్లో చూపించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి 247 కోట్ల రూపాయల అంచనాలు రూపొందించగా, దానిని కేవలం 142 కోట్ల రూపాయలకే పూర్తి చేసి శభాష్ అనిపించారు కేజ్రీవాల్. ఢిల్లీలోని ఆజాద్ పూర్ నుంచి షాలిమార్ బాగ్ వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ను అంచనాల కంటే తక్కువకే పూర్తి చేయడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ ఫ్లైఓవర్ ను కేజ్రీవాల్, వెంకయ్యనాయుడు నేడు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పనితీరును అంతా అభినందిస్తున్నారు.