: భారతీయ రైల్వేతో కాంట్రాక్టు కుదుర్చుకున్న విదేశీ సంస్థలు... ఒప్పందం విలువ రూ.37,100 కోట్లు!


భారతీయ రైల్వేకు కొత్త లోకో మోటివ్స్ ను సరఫరా చేసే నిమిత్తం విదేశీ కంపెనీలతో ఒప్పందం కుదిరింది. అమెరికా సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ), ఫ్రాన్స్ సంస్థ ఆల్సటమ్ లతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం విలువ సుమారు రూ.37,100 కోట్లుగా భారతీయ రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా వెల్లడించారు. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థకు ఒక ప్రకటన చేశారు. ఈ ఒప్పందం వివరాలను ఆయన వివరించారు. ఆల్సటమ్ సంస్థ సుమారు 800 ఎలక్ట్రిక్ లోకో మోటివ్స్ ను సరఫరా చేయనుందని, ఈ సంస్థ బీహార్ లో ఫ్యాక్టరీని నిర్మించనుందని ఆయన వివరించారు. కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం సహా ఫ్రాన్స్ తో కుదుర్చుకున్న కాంట్రాక్టు విలువ సుమారు రూ. 20,000 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. వచ్చే పదకొండు సంవత్సరాలలో జీఈ సంస్థ 1,000 డీజిల్ లోకోమోటివ్స్ ను సరఫరా చేయనుందన్నారు. జీఈతో కుదుర్చుకున్న ఒప్పందం విలువ సుమారు రూ. 17,300 కోట్లుగా పేర్కొన్నారు. ప్లాంట్, షెడ్ల నిర్వహణకు గాను సుమారు రూ.1,300 కోట్లు ఆ కంపెనీ ఖర్చు చేయనుందని అనిల్ సక్సేనా పేర్కొన్నారు. కాగా, రైలు ప్రయాణికుల ద్వారా, లగేజీ రవాణా, ఇతర మార్గాల ద్వారా భారతీయ రైల్వేకు చేకూరే ఆదాయం బాగానే ఉంటుంది. రైల్వే ఆధునికీకరణ ద్వారా మరింత మెరుగైన సేవలు ప్రయాణికులకు అందించాలన్న ఉద్దేశ్యంతో అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News