: అది ఓటమి కాదు... ఆత్మహత్య: బీహార్ లో ఓటమిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్య
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ నేతల ఘాటు వ్యాఖ్యలకు ఇప్పుడప్పుడే బ్రేకులు పడేలా లేవు. శత్రుఘ్నసిన్హా లాంటి సీనియర్ నేతలు మొదలుపెట్టిన నిరసన గళాలు గంట గంటకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఆ పార్టీ బీహారీ నేత, బెగుసరాయి ఎంపీ భోలా సింగ్ చేరిపోయారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో తమ పార్టీ ఓటమి... పరాజయం మాత్రమే కాదని పేర్కొన్న ఆయన అది సాక్షాత్తు ఆత్మహత్యేనని వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన భోలా సింగ్ ‘‘అది అపజయం కాదు, ముమ్మాటికి పార్టీ తనకు తాను చేసుకున్న ఆత్మహత్యే. ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సహా తమ పార్టీ నేతలు అతిగా స్పందించారు. అనవసర విషయాలను ప్రస్తావించారు. గోవు, పాకిస్థాన్ తదితర అంశాలను మా నేతలు అనవసరంగా ప్రస్తావించారు’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక పార్టీ ఓటమికి ప్రధాని నరేంద్ర మోదీనే బాధ్యత వహించాలని కూడా భోలా సింగ్ అన్నారు.