: కర్ణాటకలో రణరంగం... ‘టిప్పు’పై వీహెచ్ పీ ఆందోళన, పోలీసుల లాఠీలకు ఒకరు మృతి


కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మడికేరేలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించి ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. నేటి ఉదయం ప్రారంభమైన టిప్పు సుల్తాన్ జయంతికి నిరసనగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మడికేరేలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చిన వీహెచ్ పీ కార్యకర్తలు వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూయించే యత్నం చేశారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన పోలీసులు వీహెచ్ పీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించారు. దీంతో కట్టప్ప అనే వీహెచ్ పీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నడిరోడ్డుపై రక్తపు మడుగులో పడిపోయిన కట్టప్పను ఆసుపత్రికి తరలించేలోగానే అతడు చనిపోయాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం అక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.

  • Loading...

More Telugu News