: అమరావతికి చట్టబద్ధత కల్పించండి... కేంద్ర, రాష్ట్రాలకు సచివాలయ అధికారుల సంఘం లేఖ
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షుడు, న్యాయశాఖలో డిప్యూటీ కార్యదర్శి బాచిన రామాంజనేయులు కోరుతున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో అమరావతి పేరు చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తీర్మానం చేసి అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి పంపాలని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు కూడా ఆయన లేఖ రాశారు. రాష్ట్ర విభజన తరువాత సీఎం చంద్రబాబు నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అయితే రాష్ట్రంలోని కొన్ని పార్టీలు రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రదేశాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారితే అమరావతికి తరలివెళ్లే ఉద్యోగులు, అధికారులు, ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో పార్టీలు మారినప్పుడు జరిగిన సంఘటనల నేపథ్యంలో అమరావతి విషయంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశముందనే ఆలోచనతో ఈ లేఖ రాసినట్టు రామాంజనేయులు వివరించారు. అందుకే ఈ నెల 26 నుంచి మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏపీ విభజ చట్టం-2014ను సవరించాలని కోరినట్టు తెలిపారు.