: అంధకారంలో సగం ఆంధ్ర!
గడచిన 36 గంటలుగా రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో పడుతున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రాలు సహా ఏ పట్టణం, గ్రామంలో కరెంటు లేదని తెలుస్తోంది. వర్షం విపరీతంగా కురుస్తుండటంతో పలు చోట్ల వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వృక్షాలు సైతం పడిపోయాయి. శ్రీకాళహస్తి దగ్గర స్వర్ణముఖీ నది, గూడూరు దగ్గర కైవల్యా నది సహా, పలు వాగులు, చిన్నచిన్న నదులు పొంగి పొరలుతున్నాయి. వర్షం నీరు రోడ్లపై మూడడుగుల ఎత్తుకు చేరడంతో విందూరు - గూడూరు, వెంకటగిరి - డక్కిలి తదితర మార్గాల్లో రాకపోకలు ఆగిపోయాయి. ఈ ఉదయం నెల్లూరులో పర్యటించిన మంత్రి నారాయణ, ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ నిలిపివేశామని, ఈ మధ్యాహ్నానికి నెల్లూరుకు కరెంటిస్తామని తెలిపారు. సాయంత్రానికి చిత్తూరు, అనంతపురం జిల్లాలకు కరెంటును పునరుద్ధరించనున్నట్టు వివరించారు. ఈ ఉదయం నుంచి వర్షం తగ్గుముఖం పట్టగా, ప్రకాశం జిల్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని అన్నారు. ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. చెన్నై నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లు గంట ఆలస్యంగా నడుస్తున్నాయి.