: ఫేస్ బుక్ లో చేరిన ఒబామా... తొలి పోస్టు ఇదే!
యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఎట్టకేలకు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ లో ఖాతాను ప్రారంభించారు. ప్రపంచంలోని ప్రతి నలుగురు పెద్దల్లో ఒకరు ఫేస్ బుక్ లో ఉన్నందునే, వారితో తన మనస్సును పంచుకునేందుకు ఇదే సరైన మార్గమని భావించినట్టు ఈ సందర్భంగా ఒబామా తెలిపారు. మొట్టమొదటి పోస్టుగా, భూమిని రక్షించాలంటూ ఓ వీడియో తీసి పోస్టు చేశారు. వైట్ హౌస్ పచ్చిక బయళ్లపై నడుస్తూ, ఆయన మాట్లాడారు. తన తరువాత వచ్చే అమెరికా అధ్యక్షులు కూడా ఇలాగే చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆయన సోమవారం నాడు ఈ పోస్టును పెట్టగా, ఇప్పటివరకూ 15.83 లక్షల మంది వీక్షించారు. ఆయన ఖాతాను 4.5 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. కాగా, గతంలో ఒబామా కార్యాలయం ఫేస్ బుక్ ఖాతాను ప్రారంభించగా, ఇప్పుడు ఆయనే స్వయంగా తన పేరిట ఖాతాను తెరవడం గమనార్హం.