: మోదీ టపాసులను బీహార్ దోచుకుంది!... బీహార్ ఎన్నికలపై పాక్ పత్రిక ‘డాన్’ ఆసక్తికర కథనం
బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవం ప్రధాని నరేంద్ర మోదీకి నిద్ర లేని రాత్రులనే మిగిల్చింది. ప్రధాని హోదాలో ఉన్న మోదీ బీహార్ ఎన్నికల్లో 30కి పైగా బహిరంగ సభల్లో పాల్గొన్నప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం స్పందించలేదు. తమకు సుస్థిర పాలనను అందిస్తున్న నితీశ్ కుమార్ కే పట్టం కట్టారు. దీంతో మోదీపై విపక్షాలే కాక స్వపక్ష నేతలు కూడా స్వరం పెంచారు. ఈ నేపథ్యంలో విదేశీ మీడియా కూడా బీహార్ ఎన్నికను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఆది, సోమవారాల్లో అమెరికా, బ్రిటన్, పాకిస్థాన్ మీడియా ఈ దిశగా పలు కథనాలను ప్రచురించింది. బీహార్ ఎన్నికలు మోదీకి ఎదురుదెబ్బేనని ఆయా దేశాల పత్రికలు తేల్చిచెప్పాయి. ‘మోదీ టపాసులను బీహార్ దోచుకుంది’ అని పాక్ పత్రిక ‘డాన్’ సంచలన ఆసక్తికర కథనాలను ప్రచురించింది. ‘బీహార్ ఓటమిని అధికార పార్టీ అంగీకరించింది’ శీర్షికన ‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రత్యేక కథనాన్ని రాసింది. బీహార్ ఓటమి అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బేనని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. బీహార్ తీర్పుతో మోదీ తన ఆర్థిక విధానాలను ముందుకు తీసుకెళ్లడం ఇక కష్టమేనని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తేల్చిచెప్పింది. తమ దేశంలో పర్యటించనున్న మోదీని బీహార్ ఎన్నికల ఫలితాలు వెంటాడనున్నాయని బ్రిటన్ పత్రికలు పేర్కొన్నాయి.