: సిరీస్ చేజారినా ర్యాంకు పదిలం!... వన్డేల్లో 2వ ర్యాంకులోనే టీమిండియా
సొంత గడ్డపై సఫారీల చేతిలో ఘోర పరాజయాలు చవి చూసిన టీమిండియా ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా టీ20, వన్డే టైటిళ్లను చేజార్చుకుంది. పర్యాటక జట్టు ఓవరాల్ ప్రదర్శనతో పోటీ పడలేకపోయిన ధోనీ సేన వన్డే సిరీస్ ను 2-3 తేడాలో సఫారీలకు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా జట్టు ర్యాంకు దిగజారడం ఖాయమేనన్న వాదన వినిపించింది. అదే సమయంలో సఫారీల ర్యాంకు కూడా మెరుగవుతుందని భావించారు. అయితే టీమిండియా ర్యాంకు దిగజారలేదు. సఫారీల ర్యాంకు మెరుగవలేదు. నిన్న విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఇప్పటిదాకా కొనసాగుతున్న రెండో స్థానంలోనే నిలిచింది. మొత్తం 114 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్న ధోనీ సేన, తన స్థానాన్ని మాత్రం కోల్పోలేదు. ఇక టీమిండియాను చిత్తు చేసిన సఫారీలు 112 పాయింట్లతో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 127 పాయింట్లతో ఆసీస్ టాప్ ర్యాంకులో కొనసాగుతోంది.