: మా అమ్మకు నేను ఎందుకు ఓటెయ్యలేదో తెలుసా?... సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న కానిస్టేబుల్ పోస్ట్!
సాధారణంగా ఎవరైనా కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే వారిని సపోర్ట్ చేస్తాం. అదే కుటుంబంలోని తల్లి పోటీ చేస్తే? ఏ కొడుకూ ఇతరులకు ఓటు వేయడానికి సాహసించడు. కానీ కేరళలోని థమరాకుళం గ్రామానికి చెందిన ఓ కానిస్టేబుల్ చేసిన పని సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అతను తెలిపిన వివరాల ప్రకారం... వాళ్ల గ్రామ పంచాయతీకి ఈ మధ్య ఎన్నికలు నిర్వహించారు. ఆరో వార్డులో ఓ కానిస్టేబుల్ తల్లి బీజేపీ తరఫున వార్డు మెంబర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమికి పోస్టల్ బ్యాలెట్ ఓ కారణం. ఆ పోస్టల్ బ్యాలెట్ లో కానిస్టేబుల్ ఓటు ఉండడం విశేషం. అతను తన ఓటును తన తల్లికి కాకుండా ప్రత్యర్థికి వేశాడు. దానికి కారణం వివరించాడు. తన తల్లిపట్ల ఉన్న ప్రేమ దేశం పట్ల కర్తవ్యం నిర్వర్తించేందుకు అడ్డురాలేదని గర్వంగా చెప్పగలనని ఆయన పేర్కొన్నారు. 'మా అమ్మ ఓటమికి నేనే కారణం అని బాధతో చెబుతున్నా... 56 అంగుళాల ఛాతి కలిగిన వారి కంటే దేశం పట్ల నిజాయతీగా ఉన్నానని గర్వపడుతున్నాను' అని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీరు ఘోరంగా ఉందని ఆయన మండిపడ్డారు. అగ్రకులాలను అట్టడుగు వర్గాలను ఒక తాటిపైకి తేవడం ద్వారా మైనారిటీలను నిర్మూలించి దేశాన్ని హిందూత్వ దేశంగా మార్చాలని మూర్ఖంగా భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్త్రీ, పురుషులు, ట్రాన్స్ జెండర్లన్న తేడాలు లేకుండా దేశం మొత్తం ఏకతాటిగా పయనించాల్సిన ప్రస్తుత తరుణంలో మతాల పేరిట వైషమ్యాలు పెంచుతున్నారని, అది 126 కోట్ల మందిని కలిగిన దేశానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. మత ఉగ్రవాదం నుంచి ప్రగశీల పథం వైపు దేశాన్ని నడపాల్సిన ప్రస్తుత తరుణంతో మతం పేరుతో విషబీజాలు నాటడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన జీవనం కలిగిన దేశంగా మార్చాలి తప్ప ఓ మతానికో లేక ఇంకోదానికో అనుకూలమైన దేశంగా మార్చేందుకు ప్రయత్నించకూడదనే లక్ష్యంతో తానా నిర్ణయం తీసుకుని తన తల్లికి వ్యతిరేకంగా ఓటు వేశానని ఆయన పేర్కొన్నారు. కాగా, కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఆయన పోస్టుకు సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ లభిస్తోంది.