: గత కొన్ని నెలల్లో ఇదే శుభవార్తంటున్న పాక్
ఇండియాలోని బీహారు రాష్ట్రంలో బీజేపీ ఓటమిపాలు కావడం గత కొన్ని నెలల్లో పాక్ విన్న శుభవార్తల్లో ఒకటని ఆ దేశపు పత్రిక 'ది న్యూస్ ఇంటర్నేషనల్' తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. రాజకీయాలను ప్రేరేపితం చేస్తూ, ప్రజల్లో మతాన్ని రెచ్చగొట్టడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉండవని బీజేపీకి ఈ ఫలితాలతో తెలిసొస్తుందని పేర్కొంది. మోదీ వచ్చిన తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయని, కాశ్మీరులో హింస పెరగడం, సరిహద్దుల్లో కాల్పులు, ముస్లింల హత్యలు, బీఫ్ ఉదంతం, పాక్ గాయకుల పట్ల వ్యతిరేకత వంటి అంశాలు ఇందుకు కారణమని వెల్లడించింది. వచ్చే నాలుగేళ్లలో విపక్షాలు పాటించాల్సిన వ్యూహాలు ఎలా వుండాలన్న విషయమై ఈ ఎన్నికలు దిశానిర్దేశం చేశాయని అభిప్రాయపడింది. ఈ ఎన్నికలతో మోదీపై ఆ పార్టీ నేతలు పెట్టుకున్న భ్రమలూ తొలగిపోయాయని తెలిపింది.