: తదుపరి యువభేరి కాకినాడలో... హోదా కోసమేనన్న వైకాపా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా తదుపరి యువభేరీ ఈ నెలాఖరులో కాకినాడ వేదికగా జరగనుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు, తదుపరి యువభేరిలో వైఎస్ జగన్ స్వయంగా పాల్గొంటారని తెలిపారు. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా నేతలతో జగన్ సమావేశమై జిల్లాలో పార్టీ మరింతగా చొచ్చుకుపోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశం వివరాలను వెల్లడించిన ధర్మాన, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ సూచనలు చేశారని పేర్కొన్నారు. జిల్లాల్లో రైతులు మద్దతు ధర దక్కక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైందని, ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదని ఆయన ఆరోపించారు.