: గూగుల్ ఉద్యోగులకు మాత్రమే తెలిసున్న పదాలివి!
గూగుల్... ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్న ఉద్యోగులుండే సంస్థ. దాదాపు 40 వేల మందికి పైగా ఉద్యోగాలను అందించిన సంస్థలో చేరాలని భావించకుండా ఉండే టెక్కీ కనిపించడంటే అతిశయోక్తి కాదు. ఆ కంపెనీలో చేరిన వారికి మాత్రమే పరిచయమయ్యే కొన్ని పదాలున్నాయి. వీటి గురించి తెలియాలన్నా, తెలుసుకోవాలన్నా గూగుల్ లో ఉద్యోగం పొందాల్సిందే. అవేంటంటే... ప్లెక్స్: దీన్నే గూగుల్ ప్లెక్స్ అని కూడా పిలుచుకుంటారు. విశాలమైన పర్వత దృశ్యాలకు అభిముఖంగా ఉన్న క్యాంపస్ ఇది. దీన్ని ఉద్యోగులు ముద్దుగా ప్లెక్స్ అని పిలుస్తుంటారు. జీబైక్: గూగుల్ క్యాంపస్ లో ఉద్యోగుల రవాణాకు వాడే సైకిళ్ల పేరిది. మీరెప్పుడైనా ఏదైనా గూగుల్ క్యాంపస్ ను సందర్శిస్తే, రంగురంగుల్లో ఉన్న ఈ సైకిల్ బైక్ లు ఆకర్షిస్తాయి. స్టాన్: గూగుల్ ప్లెక్స్ కు మీరు వెళితే స్టాన్ కనిపిస్తుంది. ఇది గూగుల్ సొంత టీ-రెక్స్ (రాక్షసబల్లిలో ఓ జాతి) ఆస్థిపంజరాకృతి. ఉద్యోగుల దృష్టిలో గూగుల్ ఎన్నడూ డైనోసార్ కాబోదని చెప్పేందుకు దీన్ని నిలిపారట. నూగ్లర్: మీరు గూగుల్ కు కొత్తవారైతే, మిమ్మల్ని నూగ్లర్ అని పిలుస్తారు. వాడుక పరిభాషలో న్యూ-గ్లర్ అన్నమాట. కార్యాలయంలో కొత్తవారిని గుర్తించేందుకు వీరికి ఓ టోపీని ఇస్తారు. దీంతో వారు నూగ్లర్ అని మిగతావారికి తెలుస్తుంది. గేగ్లర్స్: ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్స్యువల్, ట్రాన్స్ జండర్), వారి మద్దతుదారులను గేగ్లర్స్ అని పిలుస్తారు. గూగుల్ లో సుమారు 40 మంది ఈ తరహా ఉద్యోగులున్నారు. సంస్థ చీఫ్ ఇంటర్నెట్ ఎవాంజలిస్ట్ వింట్ సెర్ఫ్ కూడా గేగ్లరేనట. క్సూగ్లర్: గూగుల్ లో ఉద్యోగం వద్దని రాజీనామా చేసి వెళ్లేవారికి పెట్టుకున్న పేరిది. ఎక్స్ గూగులర్ అన్న పదాన్ని కలిపి క్సూగ్లర్ ను పుట్టించారు. తొలి క్సూగ్లర్ పేరు డగ్ ఎడ్వర్డ్స్. గూగుల్ లో ఎంప్లాయి నంబర్ 59. గూగుల్ జీస్ట్: గూగుల్ లో ఉద్యోగుల అభిప్రాయాలు, మేనేజర్ల పనితీరు గురించి చేసే సర్వేకు పెట్టుకున్న పేరిది. సంస్థలోని 90 శాతం మంది ఉద్యోగులు మానవ వనరుల విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు గూగుల్ జీస్ట్ లో భాగంగా సమాధానమిస్తారు. పెర్ఫ్: వివిధ సందర్భాల్లో ఉద్యోగులు ఓ చోట చేరిన వేళ తన కళను ప్రదర్శించే పెర్ఫార్మర్లను పిలుచుకునే పేరిది. టీజిఫ్: వారాంతం వచ్చిందంటే, అందుకు సంకేతంగా ఉద్యోగులు టీజిఫ్ (థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే-TGIF) అంటారట. ప్రతి గురువారమూ గూగుల్ క్యాంపస్ లలో సాయంత్రం వేళ టీజిఫ్ జరుగుతుంటుంది. ఇక్కడే నూగ్లర్స్ కు టోపీలను అందిస్తారట. టెక్ స్టాప్: గూగుల్ ఐటీ విభాగానికి పెట్టుకున్న కోడ్ నేమ్ ఇది. టెక్ స్టాప్ ఉద్యోగులే గూగుల్ కార్యాలయాల్లోని కంప్యూటర్లను అమర్చడం, వాటి పనితీరు పర్యవేక్షిస్తుండటం చేస్తుంటారు. గట్స్: గూగుల్ యూనివర్సల్ టికెటింగ్ సిస్టమ్ (GUTS) ఇది. కంపెనీలో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు, వాటిని ఆన్ లైన్లో ఉంచి, దానికో టికెట్ నంబర్ ఇచ్చి, పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గట్స్ ఉపకరిస్తుంది. 20% టైమ్: గూగుల్ లో చేయాల్సిన పని కాకుండా, ఉద్యోగి తనకు నచ్చిన పని చేసుకునేందుకు 20 శాతం సమయాన్ని కేటాయిస్తారు. ఓ ఉద్యోగి 20% టైమ్ లో ఉన్నాడంటే, అసలు పని కాకుండా ఇంకో సొంత పనిలో ఉన్నట్టు. సాధారణంగా ఉద్యోగులు ఈ 20 శాతం సమయంలో జీమెయిల్, గూగుల్ న్యూస్, యాడ్ సెన్స్ వంటి గూగుల్ ప్రొడక్టుల చుట్టూ తిరుగుతుంటారట.