: ఓరుగల్లును చుట్టేస్తున్న కేటీఆర్... పోద్దున్నే జాగింగ్ సూట్ తో స్టేడియంలో ప్రత్యక్షం
వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ముగిసింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు కూడా ముగిసిన నేపథ్యంలో తుది బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, ఎన్డీఏ మిత్ర పక్షాలు టీడీపీ, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాదు నుంచి వరంగల్ కు మకాం మార్చిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. నేటి ఉదయమే వరంగల్ లో జాగింగ్ సూట్ లో బయటకు వచ్చిన ఆయన నేరుగా నగరంలోని స్టేడియానికి వెళ్లారు. అక్కడ కుస్తీలు పడుతున్న యువతతో కరచాలనం చేశారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. పార్టీ నేతలతో కలిసి అక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. ఇక డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా నేటి ఉదయమే ప్రచారం ప్రారంభించారు.