: వాతావరణంలో మార్పులపై ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు
వాతావరణంలో మార్పులు, దానివల్ల సంభవించే ప్రమాదాలపై ప్రపంచ బ్యాంకు తీవ్ర హెచ్చరికలు చేసింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని, లేకపోతే అనేకమంది జీవితాలను పేదరికంలో పడేసినట్టవుతుందని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ ఓ నివేదిక విడుదల చేసింది. 2030 నాటికి కూడా ఇలాగే కొనసాగితే 10 కోట్ల మంది ప్రజలు పేదరికంలో కూరుకుపోవడం ఖాయమని స్పష్టం చేసింది. సముద్ర మట్టాలను, వాతావరణంలో చోటు చేసుకుంటున్న వీపరీత మార్పులను (గ్రీన్ హౌస్ ఎఫెక్ట్) ను ప్రపంచ దేశాలు పట్టించుకోవాలని కోరింది. ఇందుకు ఓ స్పష్టమైన ఒప్పందానికి వచ్చి, దాని ప్రకారం నడుచుకోవాలని సూచించింది. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం సెప్టెంబర్ లో లక్ష్యంగా పెట్టుకున్న 17 అంశాల్లో ప్రపంచ దేశాల్లో పేదరికం రూపుమాపడమనేది కీలక అంశంగా ఉందని, అలాంటప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే ఆ లక్ష్యం నెరవేరడం అసలు సాధ్యం కాదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.