: ఆ దుర్మార్గులను ముక్కలుగా నరకాలి!...సూసైడ్ నోట్ రాసి తనువు చాలించిన ఇంటర్ విద్యార్థిని
గుంటూరు జిల్లాలో నిన్న విషాదం చోటుచేసుకుంది. కళాశాలకు వెళుతున్న బస్సులో ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం చెందింది. చనిపోతూ తన ఆవేదనను కళ్లకు కట్టేలా సూసైడ్ నోట్ రాసిన సదరు విద్యార్థిని ఆకతాయిలను ముక్కలుగా నరికివేయాలని సూచించింది. వివరాల్లోకెళితే... గుంటూరు జిల్లాలోని వెల్దుర్తికి చెందిన రాపోలు తిరుపతమ్మ (16) అదే జిల్లా మాచర్లలోని కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. సొంతూరు నుంచి కళాశాలకు వెళ్లేందుకు ఆ బాలికకు బస్సే ఆధారం. అయితే బాలిక స్వగ్రామం నుంచి మాచర్లలోని వేర్వేరు కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న పలువురు విద్యార్థులు కూడా అదే బస్సులో వెళతారు. ఈ క్రమంలో బాలిక స్వగ్రామానికి చెందిన ఓ ఆకతాయితో పాటు అతడి స్నేహితులు బస్సులో కళాశాలకు వెళ్లే అమ్మాయిలపై వేధింపులకు దిగేవారు. సెల్ ఫోన్లలో ఫొటోలు తీస్తూ తమ మాట వినకపోతే వాటిని నెట్ లో పెడతామని బెదిరిస్తూ పలువురు అమ్మాయిలను సదరు ఆకతాయిల ముఠా లోబరుచుకుందట. ఈ క్రమంలో తిరుపతమ్మను కూడా ఆ ముఠా వేధించింది. దీంతో వారి వేధింపులు తాళలేక ఆదివారం తన తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా తిరుపతమ్మ ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. చనిపోయే ముందు ఆకతాయిల వేధింపులను మూడు పేజీల లేఖలో సవివరంగా రాసింది. ముఠాలోని ఆకతాయిల పేర్లను కూడా ఆ బాలిక పేర్కొంది. బుద్ధిగా చదువుకుంటున్న అమ్మాయిలపై వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిలను ముక్కలుగా నరకాలని ఆ లేఖలో తిరుపతమ్మ రాసింది. బాలిక మృతితో రంగంలోకి దిగిన పోలీసులు సదరు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.