: సీట్లు తగ్గినా... ఓట్ల శాతం మాత్రం పెరిగింది: ఇదొక్కటే బీజేపీకి ఊరట!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రాభవం గట్టెక్కించలేదు. రూ.1.25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ జీవం పోయలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం తప్పలేదు. రోజుల తరబడి ప్రధాని, కేంద్ర మంత్రులు, పదుల సంఖ్యలో ఎంపీలు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగినా ఆశించిన ఫలితం రాకపోగా, దారుణ ఫలితాలతో దిమ్మతిరిగిపోయింది. అయితే ఒకే ఒక్క అంశం బీజేపీ నేతలకు ఊరట కలిగిస్తోంది. బీహార్ అసెంబ్లీ బరిలో బీజేపీకి కేవలం 53 సీట్లు దక్కాయి. 2010లో 91 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 38 సీట్లను వదులుకోవాల్సి వచ్చింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే, ఈ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లలో భారీ పెరుగుదల నమోదైంది. గడచిన ఎన్నికల్లో 16.5 శాతం బీహారీల ఓట్లను చేజిక్కించుకున్న బీజేపీ, ఈ దఫా 24.4 శాతం ఓట్లను కొల్లగొట్టేసింది. అంటే దాదాపుగా 7.9 శాతం ఓట్లను ఆ పార్టీ పెంచుకుంది. ఇదొక్కటే బీజేపీకి ఊరటనిస్తోంది.