: ఈ ఫలితాలు రాజకీయ దురహంకారానికి చావుదెబ్బ: మాజీ మంత్రి జైపాల్ రెడ్డి
బీహార్ ఫలితాలు రాజకీయ దురహంకారానికి, అసహన సంస్కారానికి చావు దెబ్బ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. బీహార్ ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలు దేశంలోని అన్ని అధికార పార్టీలకు ఓ పాఠం లాంటివన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవి ప్రతిష్టను మోదీ దిగజార్చుతున్నారని, దేశాభివృద్ధి గురించి ఆయన ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. దేశాభివృద్ధి కోసం ప్రతిపక్షాలను కలుపుకుని పోవాలని హితవు పలికారు. ఏ ఎన్నికలకు వెళ్లినా భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఫలితాలనే చవి చూడాల్సివస్తుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ ఓడితే పాకిస్థాన్ గెలిచినట్లేనన్న అమిత్ షా వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. భారతదేశంలో ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ పాకిస్థాన్ ఏజెంట్లా? అని ఆయన ప్రశ్నించారు.