: దూసుకెళుతున్న ఆర్జేడీ... లాలూ కుమారుడు మాత్రం వెనుకంజ
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో క్షణక్షణానికి అంచనాలు మారిపోతున్నాయి. తొలుత వెనుకబడ్డ మహా కూటమి ఆ తర్వాత బీజేపీ కంటే అధిక స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ 85 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. బీజేపీ కూడా దూసుకువస్తున్నా మహా కూటమి కంటే వెనుకబడింది. ఇదిలా ఉంటే, మహా కూటమిలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ జేడీయూ కంటే లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. అయితే తొలిసారిగా బరిలోకి దిగిన లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ రాఘవ్ పూర్ నియోజకవర్గంలో వెనుకబడ్డారు. లాలూ మరో కుమారుడు తేజ్ ప్రసాద్ యాదవ్ మాత్రం మహువా నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక సొంత కుంపటి పెట్టుకున్న మాజీ సీఎం జితన్ రాం మాంఝీ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం దిశగా సాగుతున్నారు.