: నయనానందకరం...క్రికెట్ అభిమానుల మనసులు పులకించిన వేళ!
ప్రపంచ క్రికెట్ అభిమానుల మనసులు పులకించాయి. సుదీర్ఘ విరామం తరువాత గ్రౌండులో తమ అభిమాన ఆటగాళ్ల విన్యాసాలు చూసే అదృష్టం కలిగినందుకు సంబరపడిపోయారు. రిటైర్ అయిన వారితో అమెరికాలో క్రికెట్టా? ఆదరణ లభిస్తుందా? అసలే అక్కడ క్రికెట్ అన్నదే లేదు... అలాంటప్పుడు వీరినెవరు పట్టించుకుంటారు? అంటూ ఎన్నో కామెంట్లు వినిపించాయి. అలాంటి నేపథ్యంలో నిన్న రాత్రి న్యూయార్క్ లోని సిటీ ఫీల్డ్ స్టేడియం నిండిపోయింది. చాలా కాలం తరువాత సచిన్, వార్న్, డోనల్డ్, అక్రమ్, సెహ్వాగ్, లక్ష్మణ్, కలిస్, జయవర్థనే, సంగ, పాంటిగ్, జాంటీలకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఎంతో కాలం క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన కోట్నీ వాల్ష్, అలెన్ డోనల్డ్, వసీం అక్రమ్, షేన్ వార్న్ వంటి వారి బౌలింగ్ తో పాటు... గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన జాక్వస్ కలిస్, డానియెల్ వెటోరీ వంటి బౌలర్లను సెహ్వాగ్, సచిన్ జోడీ బాదుతుంటే 'వాహ్... ఆ మజాయే వేరంటూ' అభిమానులు ఆస్వాదించారు. సచిన్ ఆచి తూచి ఆడగా, సెహ్వాగ్ వచ్చిన ప్రతి బౌలర్ ను చితకబాదాడు. కేవలం 20 బంతుల్లోనే సెహ్వాగ్ 54 పరుగులు చేయడం విశేషం. వార్న్ బౌలింగ్ లో సచిన్ (26) కొట్టిన షాట్ ను జాక్వెస్ కలిస్ అద్భుతమైన రీతిలో అవుట్ చేశాడు. దీంతో సచిన్ బ్లాస్టర్స్ తొలి వికెట్ నష్టపోయింది. తరువాతి బంతికి సెహ్వాగ్ (55) అవుటయ్యాడు. అనంతరం వార్న్ వేసిన అద్భుతమైన బంతికి బ్రియాన్ లారా (1) ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. వార్న్ వేసిన బంతిని అంచనా వేయడంలో తడబడిన లక్ష్మణ్ (8)ను సంగక్కర స్టంప్ చేసి పెవిలియన్ బాటపట్టించాడు. మహేల జయవర్థనే (18) ఆండ్రూ సైమండ్స్ సంధించిన బంతిని సిక్సర్ గా మలచబోయి ఆగార్కర్ చేతికి చిక్కాడు. సైమండ్స్ వేసిన బంతిని అంచనా వేయడంలో తడబడిన కార్ల్ హూపర్ (11) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాటపట్టాడు. సైమండ్స్ బౌలింగ్ లో వస్తూనే భారీ షాట్లకు ప్రయత్నించిన మెయిన్ ఖాన్ (1)ను లాంగాన్ లో ఉన్న కలిస్ పట్టేశాడు. తరువాత బౌలింగ్ చేసిన వసీం అక్రమ్ మెయిడెన్ ఓవర్ చేయడం విశేషం. అనంతరం అలన్ డొనల్డ్ బౌలింగ్ లో భారీ సిక్సర్ తో అలరించిన షాన్ పొలాక్ (11) తరువాతి బంతికి కలిస్ కి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అనంతరం కర్ట్ లీ ఆంబ్రోస్ (1), ముత్తయ్య మురళీ ధరన్ (2) నాటౌట్ గా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన సచిన్ బ్లాస్టర్స్ జట్టు 140 పరుగులు సాధించింది. అనంతరం వార్న్ వారియర్స్ ఆటగాళ్లు బ్యాటింగుకి దిగారు. కలిస్ (13) మురళీధరన్ విసిరిన అద్భుతమైన త్రోకు బలయ్యాడు. మాథ్యూ హేడెన్ (4)ఆకట్టుకున్నాడు. షోయబ్ అక్తర్ బంతిని బౌండరీ తరలించే ప్రయత్నంలో హేడెన్ కీపర్ మెయిన్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం సంగక్కర (41) విరుచుకుపడ్డాడు, రీకీ పాంటింగ్ (48) సాధికారికమైన షాట్లతో మరోసారి పాత రోజులను తలపించాడు. వీరిద్దరూ తమలో ఏమాత్రం వాడి తగ్గలేదని నిరూపించారు. అనంతరం వచ్చిన జాంటీ రోడ్స్ కేవలం 14 బంతుల్లో 20 పరుగులు చేసి స్వీప్ సిక్స్ తో మ్యాచ్ ముగించాడు. దీంతో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయిన వార్న్ వారియర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సచిన్ టీమ్ లో అక్తర్ రెండు వికెట్లు తీసి రాణించగా, మురళీ ఒక వికెట్ తీసి సహకరించాడు. కాగా, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా పాంటింగ్ నిలిచాడు.