: అయ్యన్నపాత్రుడికి మావోల బెదిరింపు?...టీడీపీలో కలకలం రేపుతున్న బెదిరింపు లేఖ
నవ్యాంధ్రలో అధికార పార్టీ టీడీపీకి నిషేధిత మావోయిస్టులు షాకిచ్చారు. పార్టీ సీనియర్ నేత, ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి మావోయిస్టుల నుంచి బెదిరింపుల లేఖ వచ్చింది. బాక్సైట్ తవ్వకాలకు ఏపీ సర్కారు ఇచ్చిన అనుమతులను నిరసిస్తూ మావోలు మంత్రికి ఘాటు లేఖ రాశారట. బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ మంత్రి పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేయాలని సదరు లేఖలో అయ్యన్నపాత్రుడికి మావోలు సూచించారు. తమ సూచన మేరకు రాజీనామా చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆ లేఖలో మావోలు బెదిరించారు. దీనిపై అయ్యన్న వెనువెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారని తెలుస్తోంది. అయితే, మావోల బెదిరింపులను మీడియా ముందు అయ్యన్న కొట్టిపారేశారు. అయితే ఈ లేఖపై ప్రస్తుతం టీడీపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే బాక్సైట్ కేటాయింపులపై విశాఖ మన్యంలో టీడీపీకి చెందిన ముగ్గురు మండల స్థాయి నేతలను అపహరించిన మావోలు రోజుల తరబడి తమ వద్దే వారిని బందీలుగా ఉంచుకున్నారు. తాజాగా అయ్యన్నకు లేఖతో విశాఖలో ఎప్పుడేం జరుగుతుందా? అన్న భయాందోళనలు నెలకొన్నాయి. అయ్యన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏజెన్సీలో మావోల కదలికలున్నాయని నిర్ధారించారు. మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అయ్యన్నకు సూచించారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లరాదని కూడా పోలీసులు మంత్రిని కోరారు.